6 కోట్ల మంది ఆంధ్రుల కల నెరవేర్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేళ్లు గడిచిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోకెల్లా అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు పునాదులు పడి ఏళ్లు గడుస్తున్నాయి. అయితే, జగన్ వంటి పాలకుల వల్ల అమరావతి సర్వనాశనం అయిందని, ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని మద్దతు పలికిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ ప్రకటనలు చేస్తున్న వైనంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
విశాఖే రాజధాని అని, త్వరలోనే అక్కడ నుంచి పాలన ప్రారంభిస్తామని సీఎం జగన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతేనని, దానిని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని స్పష్టం చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఓ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఏపీసీఆర్డీయే ఏర్పాటు చేస్తూ ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం 2020లో ఏపీసీఆర్డీయేను రద్దు చేసి, 3 రాజధానుల ప్రతిపాదనతో కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ చెప్పారు.
కానీ, ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరో బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దీనిపై ఎక్కువగా మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుందని చెప్పారు. 3 రాజధానులపై కేంద్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.