కల్కి.. యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీనే కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వని దత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో కల్కి మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రమోషన్స్ ద్వారా చిత్రటీమ్ ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్తున్నారు. మరోవైపు కల్కి మూవీపై నెట్టింట ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కల్కి కన్సెప్ట్ తో పదేళ్ల క్రిందటే ఓ సినిమా వచ్చిందట. అదే `ఎలిసియం`. ఇది మన ఇండియన్ మూవీ కాదు.
హాలీవుడ్ లో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా 2013లో విడుదలైంది. నీల్ బ్లామ్క్యాంప్ రచించి, నిర్మించి మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాట్ డామన్ హీరోగా నటించారు. అయితే ప్రభాస్ నటించిన కల్కి మరియు ఎలిసియం సినిమాల జోనర్ మాత్రమే కాకుండా కన్సెప్ట్ కూడా ఒకేలా ఉంటుందని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రకారం చూస్తే.. కల్కి సినిమాలో కొన్ని వందల ఏళ్ల తర్వాత భూమిపై పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మనిషి మనుగడ ఎంతో కష్టతరంగా మారుతుంది.
భూమికి చాలా ఎత్తులో కాంప్లెక్స్ అనే భారీ నిర్మాణం ఉంటుంది. అందులో సుప్రీం యాష్కిన్ అనే వ్యక్తి హయాంలో ఉన్నోళ్లంతా ఉంటారు. సుప్రీం యాష్కిన్ ఒక అమ్మాయిని పట్టి తీసుకురమ్మని భైరవ అయిన ప్రభాస్‌కు అప్పజెప్తాడు. ఆ అమ్మాయి కోసం భైరవ.. అశ్వథ్దామతో పోటీకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది కల్కి స్టోరీగా అనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ మూవీ ఎలిసియం కూడా ఉంటుంది. 2154 లో నడిచే స్టోరీ ఇది. ఇందులో పేద ప్రజలంతా ధీన స్థితిలో భూమిపై ఉంటే.. డబ్బున్న వాళ్లందరూ భూమికి దూరంగా అంతరిక్షంలో ఎలిసియం అనే దాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటారు.
కల్కిలో కాంప్లెక్స్, హాలీవుడ్ సినిమాలో ఎలిసియం ఒకేలా ఉన్నాయి. అలాగే కల్కి మరియు ఎలిసియం రెండు చిత్రాల్లో హీరోలు భూమిపై కాకుండా అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న చోటికి వెళ్లిపోయి లగ్జరీగా బ్రతకాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో చివరకు ఏమైంది అన్నదే కథ. అయితే ఎలిసియం మూవీ సీరియస్ టోన్ లో సాగితే.. కల్కి మాత్రం యాక్షన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా ఇలా అన్ని అంశాలను జీడించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.