వైసీపీ హయాంలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా అమరావతిని స్మశానంతో పోల్చారు.అప్పట్లో బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు శాసనమండలిలో అమరావతి రాజధానిపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి.
ఈ క్రమంలోనే బొత్స కామెంట్లకు టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కౌంటర్ ఇచ్చారు. అమరావతి స్మశానం అయితే బొత్స కాటి కాపరా? అంటూ అనురాధ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే, సభలో అమరావతి రాజధాని అంశంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అని అన్నామని బొత్స చెప్పారు. ఇప్పుడు రాజధానిపై స్టాండ్ ఏంటి అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అప్పుడు తాము అంత ఖర్చు పెట్టే పరిస్థితిలో లేమని బొత్స చెప్పారు.
అందుకే అమరావతి స్మశానంలా ఉందని అన్నానని, .. ఇందులో ఎలాంటి వివాదం లేదని బొత్స చెప్పారు. బొత్స తాజా కామెంట్ల నేపథ్యంలో అమరావతి రాజధాని అంశంపై వైసీపీ మెత్తబడిందని కామెంట్లు వస్తున్నాయి. విశాఖ ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పినా అక్కడ ఒక సీటు కూడా రాలేదని, అందుకే వైసిపి తన స్వరం మార్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.