ఈ రోజు దివంగత నేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయన ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలున్నాయని, అయినా సరే ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని సజ్జల అన్నారు.
ప్రజల పక్షాన పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అసాధ్యమైన హామీలతో ప్రజలను ప్రత్యర్థి పార్టీలు మభ్యపెట్టి అందలమెక్కాయని ఆరోపించారు. హామీలు ఇచ్చి మోసం చేయడం, ప్రజలను భ్రమలలో ఉంచడం జగన్ కు చేతకాదని అన్నారు. కుల,మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా జగన్ పాలన అందించారని, విద్యా, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే నిలదీస్తామని అన్నారు.
తామిచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యం కాదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తున్నారని చెప్పారు. 6 నెలల క్రితం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబుకు తెలియదా అని సజ్జల ప్రశ్నించారు. హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేమంటూ చేతులెత్తేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 10% ఇచ్చినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ ది ఆ పద్ధతి కాదని చెప్పుకొచ్చారు. ప్రజలను పదేపదే మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచారని సజ్జల అన్నారు.