ఏపీ ప్రజల జల జీవనాడి పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని.. రివర్స్ టెండర్ల ద్వారా.. లాభం చేకూర్చకపోగా.. సర్వం భ్రష్టు పట్టించిందని.. ఏపీ సీఎం చంద్ర బాబు వారం రోజుల కిందట సచిత్రంగా వివరించిన విషయం తెలిసిందే. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటన పోలవరం ప్రాజెక్టుకు తొలి పర్యటన పెట్టుకుని వెళ్లి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. విషయాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరించారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమన్నారు.
అంతేకాదు.. జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే పోలవరం విధ్వంసమైందని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ వాదనకు పూర్తి భిన్నంగా.. నరసాపురం ఎంపీ, బీజేపీ నాయకులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014-19 జరిగిన నిర్మాణాల్లో నాణ్యతాలోపాల కారణంగానే ప్రాజెక్టు నాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ సహా ఇతర నిర్మాణాల్లో నాణ్యత లోపించడం వల్లే అవి వరదలకు కొట్టుకుపోయాయని తెలిపారు.
అంతేకాదు.. 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు విజ్ఞప్తి మేరకే.. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి అప్పగించిందని వర్మ చెప్పారు. దీనివల్ల ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందని కూడా భావించారని కానీ అలా జరగలేదన్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకుంటుందా? తీసుకుని నిర్మాణం పూర్తిచేస్తుందా? అనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చిత్తశుద్ధితోనే పనిచేసిందని.. దీనిలో ఎలాంటిసందేహం లేదన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీనిని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉందని వర్మ వ్యాఖ్యానించారు. అయితే.. అప్పట్లో రాష్ట్ర, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు.. ఉండడంతో ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రాష్ట్రానికే ఈ ప్రాజెక్టును అప్పగించినట్టు చెప్పారు. అయితే.. డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంల నిర్మాణంలో జరిగిన నాణ్యాతపరమైన లోపాల కారణంగానే వరదలకు కొట్టుకుపోయాయని.. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైపోయిందని వ్యాఖ్యానించారు.
అయితే.. ఇప్పుడు కూడాఅటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే ఉన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు.. వర్మ ఇలా విమర్శలు గుప్పించడం సరైన పద్ధతేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.