వైసీపీ హయాంలో నాలుగో సింహం (పోలీసులు) నలిగిపోతోందా? కోర్టు మెట్లెక్కడం నుంచి న్యాయమూర్తులతో చీవాట్లు తినడం వరకు, జాతీయ మహిళా కమిషన్‌తో ఆక్షేపణ నుంచి ఎస్సీ కమిషన్‌తో విచారణ వరకు.. నాలుగో సింహం అగచాట్లు పడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా దూకుడు ప్రదర్శిస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు చరమగీతం పాడిన రాష్ట్ర హోం శాఖ.. నేడు కేంద్రం నుంచి కూడా నగుబాటు ఎదుర్కొంది. అనేక కేసుల్లో హైకోర్టు నుంచి అపవాదులు మోసింది. అదేసమయంలో డీజీపీ, ఎస్పీ, ఐజీస్థాయి అధికారులు సైతం బోనులో నిలబడి చేతులు కట్టుకుని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక, ఇప్పుడు తాజాగా కేంద్ర హోం శాఖ కూడా సీరియస్ అయింది. నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ పోలింగ్ సమయంలో చేసిన రచ్చపై వివరణ కోరుతూ.. హోం శాఖ డీజీపీకి లేఖరాసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక, కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా.. పోలీసుల నిర్వాకాన్ని, ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. తక్షణం వెళ్లిపోండి! అని ఆదేశాలు సైతం ఇచ్చింది. ఇదేసమయంలో సీఆర్ పీఎఫ్ దళాలను అప్పటికప్పుడు రంగంలోకి దింపేసింది. ఏపీకి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేశారు. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్ వద్దే మకాం వేశారు. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసింది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే, ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పీఎస్‌లో కేసు నమోదైంది.
ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారనని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా.. ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులపై(భారీ సంఖ్యలో) పొరుగు రాష్ట్రంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ పాలనలో నాలుగో సింహం నలిగిపోతోందని రిటైర్డ్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.