గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి, నేతల ఫిరాయింపులు, కేసులు, అరెస్టులతో వైసీపీ క్యాడర్ బలహీనంగా మారింది. ఓటమి బాధ నుంచి వేగంగా రికవరీ అయిన అధినేత వైఎస్ జగన్.. వైసీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పష్టమైన మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఐదేళ్లలో చేసిన తప్పులను, తప్పిదాలను సరి చేసుకోవడం ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై కన్నెత్తి కూడా చూడని జగన్.. సీఎం కుర్చూ పోయాక కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ప్రజలతో కూడా మమేకం అయ్యేందుకు జగన్ రెడీ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో భారీ జనాదరణతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అధికారం చేపట్టాక జనాలకు అందనంత దూరంలో వెళ్లి కూర్చున్నారు. బటన్లు నొక్కుతూ బిల్డప్‌లు ఇచ్చారు కానీ.. నేరుగా ప్రజలను కలిసింది లేదు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నది లేదు. ఫలితంగా ఓటు అన్న ఆయుధంతో ప్రజలు జగన్ ను గట్టి దెబ్బ కొట్టారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కన్నా ప్రజలనే ముందుగా కలిసేవారు. నిత్యం సామాన్య ప్రజలకు కొంత సమయాన్ని కేటాయించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాక సత్వరమే పరిష్కారం చూపేవారు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో మహానేతగా ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ కూడా తన తండ్రి బాటలోనే నడవాలని భావిస్తున్నారట.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా జగన్ స్కెచ్ వేశారు. ఇకపై అపాయింట్మెంట్ లేకుండానే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సామాన్య ప్రజలను నేరుగా కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం పలు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాట్లు చేయిస్తున్నారు. అలాగే దూరం నుంచే వచ్చే ప్రజలకు భోజన సదుపాయాలు కూడా అందించాలని జగన్ నిర్ణయించారట.