కొద్ది రోజులుగా వైసీపీ మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. జగన్ చెప్పిన రెండున్నరేళ్ల డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో తమ పనితీరుకు జగన్ ఎన్ని మార్కులు వేశారు…తమ పదవి ఉంటుందా ఊడుతుందా…అన్న అనుమానం దాదాపుగా అందరు మంత్రులకు ఉంది. ఈ క్రమంలోనే తాము బాగాపనిచేశామని చెప్పుకునేందుకు కొందరు మంత్రులు మీడియా సాక్షిగా విశ్వప్రయత్నాలు చేస్తుండగా…మరికొందరు తమ అధినేత జగన్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా తన పదవిపై టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా వైసీపీ నేత లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి…ధర్మాన కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కావాలని సభాముఖంగా కోరుకోవడం చర్చనీయాంశమైంది.
ధర్మాన ప్రసాదరావు మంత్రి కావాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటున్నానంటూ లక్ష్మీ పార్వతి పాస్ చేసిన కామెంట్ సిక్కోలు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇక, మరో అడుగు ముందుకు వేసిన లక్ష్మీ పార్వతి…శ్రీకాకుళం జిల్లాకు ధర్మాన ప్రసాదరావు వల్లే చాలా పేరు వచ్చిందంటూ ఆకాశానికెత్తేశారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ధర్మాన ప్రసాదరావు అనుచరులకు కిక్ నిచ్చాయి. అదే సమయంలో, ఆ వ్యాఖ్యలపై ధర్మాన కృష్ణదాస్ అనుచరులు గుర్రుగా ఉన్నారట. మరోవైపు, ఈ వ్యాఖ్యలపై శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
వాస్తవానికి జగన్ తొలి కేబినెట్లో సీనియర్ పొలిటిషియన్ అయిన ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కుతుందని ఆశించారు. అనూహ్యంగా ఆయన సోదరుడు కృష్ణదాస్‌ను జగన్ ఎన్నుకొని డిప్యూటీ సీఎంని కూడా చేశారు. అయితే, తాజాగా రెండున్నరేళ్ల డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో ధర్మాన ప్రసాదరావు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారట. ఈ సమయంలో ప్రసాదరావునుద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మీపార్వతి కాకతాళీయంగా మాట్లాడారా..కావాలని మాట్లాడారా అన్న విషయం పక్కనపెడితే…సిక్కోలు వైసీపీలో లక్ష్మీ పార్వతి చిచ్చుపెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.