అధికారం కోల్పోయినా కొందరు వైసీపీ నేతలకు నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. రైతులపై నోరు పారేసుకోవడంతో స్పెషలిస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాజాగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం.. నరికేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోయేది వైసీపీనే. కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని దాటి ప్రజలు మనకే ఓటేస్తారని పెద్దిరెడ్డికి చెప్పాను. టీడీపీ నాయకులు సైతం తమపై కక్ష పెట్టుకోవద్దని అంటున్నారు. అది జరగదు. ఎవర్నీ వదలం అంటూ కారుమూరి హెచ్చరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడుతారు.. గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరం అంటూ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కారుమూరి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. టీడీపీ కేడర్ కారుమూరి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కారుమూరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి.