మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత విపక్ష వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలో కీలక నేతలంతా అధికారం లేని చోట ఉండలేక పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు వైసీపీని వీడగా.. ఇప్పుడు మరో బిగ్ వికెట్ డౌన్ అయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి ముఖ్య సలహాదారుల్లో ఒకరిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ కృష్ణ తాజాగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరి పోయారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు గోదావరి జిల్లాల రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన దొమ్మేరు జమిందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణ బాబు అల్లుడే రాజీవ్ కృష్ణ. చంద్రబాబుతో విభేదాలు రావడంతో కోవూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు జగన్ కు దగ్గరయ్యారు. ఆయన వారసుడిగా రాజీవ్ కృష్ణ కూడా వైసీపీలో చేరి జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా పని చేశారు.
కానీ రాజీవ్ కృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆయన్ను జగన్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. జగన్ వైఖరిని సహించలేకపోయిన రాజీవ్ కృష్ణ.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి దూరమవుతూ వచ్చారు. వైసీపీ కార్యక్రమాల్లో మరియు పార్టీ ఆఫీస్లో కనిపించడం మానేశారు. ఇక తాజాగా వైసీపీ రాష్ట్ర సలహాదారుడు పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసిన రాజీవ్ కృష్ణ.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా సైకిల్ ఎక్కేశారు. పసుపు కండువా కప్పి రాజీవ్ ను లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.