తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై టీడీపీ నేతలు విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, బడ్జెట్ బ్రహ్మాండం అంటూ జగన్ సహా వైసీపీ ఎంపీలు మాట్లాడడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి నాయకులపై టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. బడ్జెట్ పై వైసీపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
బుగ్గన ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, ఇదే బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని మిథున్ రెడ్డి అంటున్నారని, బుగ్గన వేరేలా చెప్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా ఉండడం సిగ్గుచేటని వైసీపీ ఎంపీలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరంపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా ఈ 32 మంది ఎంపీలు చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీలు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటని యనమల ప్రశ్నించారు. వృద్ధిరేటులో ఏపీ మొదటి స్థానంలో ఉందని జగన్ దొంగ లెక్కలు చెబుతున్నారని, ఆ రకంగా ఆయన నవ్వుల పాలై రాష్ట్రాన్ని కూడా నవ్వులపాలు చేశారని యనమల ఎద్దేవా చేశారు. వృద్ధిరేటు, సంక్షేమంపై జగన్ కు సవాల్ చేస్తే పారిపోయారని, ధైర్యం ఉంటే చర్చకు ముందుకు రావాలని యనమల సవాల్ విసిరారు.
కరెంట్ చార్జీలు పెంచడం, అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టడం వంటి వాటిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని జగన్ ను యనమల ఏకిపారేశారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని యనమల ప్రశ్నించారు. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని వైసిపి నేతలు మింగేశారని, అందుకే రాష్ట్రం ఆదాయం తగ్గిందని యనమల విమర్శించారు.