కర్ణాటక సీఎం యడియూరప్పను ఆ పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందని కన్నడ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25తో యడ్డీ పగ్గాలు చేపట్టి రెండేళ్ళు పూర్తవుతుందని, జులై 26న యడ్డీ రాజీనామా చేయడం, ఆ వెంటనే కొత్త సీఎం పేరు ప్రకటించడం వంటివి చకచకా జరిగిపోతాయని కర్ణాటకతోపాటు, ఢిల్లీ వర్గాల్లో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక, సీఎంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని, తననే అధిష్టానం సీఎంగా కొనసాగమందని యడ్డీ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎంగా యడియూరప్ప తొలగింపునకు సంబంధించి కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నలిన్ కుమార్ కతీల్దిగా భావిస్తోన్న ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌లో కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి మరొకరితో తులు భాషలో యడ్డీ తొలగింపు ఖాయమని మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈశ్వరప్ప, షెట్టర్ బృందాన్ని తొలగించి, ఆ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని కతీల్ గా భావిస్తున్న వ్యక్తి మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వారిలో ఒకరిని కొత్త సీఏంగా ఢిల్లీ ఆఫీసు ప్రకటిస్తుందని చెప్పినట్టుంది. అయితే, ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని, పార్టీలో గొడవలు రేపేందుకు తన గొంతును అనుకరించారని అంటున్నారు. దీనిపై సీఎం లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.