వైసీపీ హయాంలో తెచ్చిన మద్యం పాలసీ, మద్యపాన నిషేధం, నాసిరకం మద్యం, అధిక ధరలకు చీప్ లిక్కర్, నాణ్యమైన బ్రాండ్లు లేకపోవడం వంటి విషయాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు కోట్లు దోచిపెట్టేందుకు మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరపకుండా నగదు లావాదేవీలు చేసిన వైనంపై కూడా సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మద్యం పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.
అంతేకాదు, గత ఐదేళ్లలో మద్యం పాలసీపై సీఐడీ, ఈడీ విచారణ చేపడతామని చంద్రబాబు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.
2019-24 మధ్య జగన్ ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీపై సీఐడీ విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన రిక్వెస్ కు సీఎం చంద్రబాబు స్పందించారు. సీఐడీ విచారణ వేసి మద్యం పాలసీలో అవకతవకలపై వాస్తవాలు తేలుస్తామని, నగదు లావాదేవీలపై ఈడీకి ఫిర్యాదు చేసి నిజాలు బయటకు తెస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బూమ్ బూమ్ అంటూ వింత వింత పేర్లు పెట్టి మద్యం అమ్మారని చంద్రబాబు వేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జగన్ పాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు చెప్పారు. 2019-24 మధ్యలో జగన్ పాలన పాలకుడు ఎలా ఉండకూడదు అనేందుకు ఒక కేస్ స్టడీ అని ఎద్దేవా చేశారు. చాలా బాధతో ఎక్సైజ్ విధానం పై శ్వేత పత్రం విడుదల చేయాల్సి వస్తోందన్నారు. మద్యం రేటు పెంచి వినియోగం తగ్గిస్తామన్న అస్తవ్యస్త విధానం వల్ల ఎక్సైజ్ శాఖలో కేసులు పెరిగిపోయాయని చెప్పారు. క్వాలిటీ లిక్కర్ బ్రాండ్లు ఏపీలో దొరకకుండా చేశారని, నాసిరకం బ్రాండ్లను జనాలకు అంటగట్టారని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల వచ్చే ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిదని ఆరోపించారు.