దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏపీలో రూపకల్పన చేశామని సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ వలంటీర్ల సేవలు అద్భుతమని, వారు ఉండడం వల్లే కరోనా కట్టడి సాధ్యమైందని వైసీపీ నేతలు చెబుతుంటారు. అయితే, వలంటీర్లను వైసీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఉపయోగించుకున్నారని విమర్శలు వచ్చాయి.
మరోవైపు, తమకు కూడా జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇచ్చే 5 వేల రూపాయల జీతం సరిపోవడం లేదని వలంటీర్లు ఇటీవల ఉద్యమబాటపట్టారు. దీంతో, రంగంలోకి దిగిన జగన్…వలంటీర్ లు చేసేది సేవ అని, వారికిచ్చేది గౌరవ వేతనం మాత్రమే అని, జీతం కాదని హితబోధ చేశారు. వలంటీర్లు వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలని చెప్పిన జగన్ ఉత్తమ సేవలందించిన వలంటీర్లను సన్మానించారు కూడా.
అయితే, సేవ పేరుతో ఇటు జీతం రాకపోగా..వలంటీర్లపై పని భారం పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనతంపురం జిల్లాలో ఓ వలంటీరు పని భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన చావుకు తాను చేస్తున్న వలంటీర్ ఉద్యోగమే కారణమంటూ ఓ వలంటీర్ రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది. తన లాంటి దుస్థితి మరే వలంటీర్ కు రాకుండా జగన్ చూడాలని ఆ లేఖలో అతడు కోరడం కలచివేస్తోంది.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలోని నాల్గవ సచివాలయం తొమ్మిదో వార్డులో మహేష్ వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం మహేష్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ రాసిన ఆత్మహత్య లేఖ వైరల్ అయింది. వలంటీర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం…కనీసం వలంటీర్లు 3 పూటలా అన్నం తినేందుకు ఆ 5వేలు సరిపోతున్నాయో లేదో చూడడం లేదని మహేష్ వాపోయాడు.
వలంటీర్ల గురించి ఎవరూ ఆలోచించడం లేదని మహేష్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాంటి పరిస్థితి మరొక వాలంటీర్‌కు రాకుండా జగన్ చూడాలని, వలంటీర్లకు జీతాలు ఇవ్వాలని మహేష్ వేడుకున్నాడు. అంతేకాదు, వలంటీర్లతో జగన్ సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకోవాలని మహేష్ వేడుకున్నాడు. మరి, మహేష్ చివరి కోరికను జగన్ తీరుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.