ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు అసలు వ్యవస్థలోనే లేరని, వారిని కొనసాగించాలా వద్దా అన్న విషయంపై ఇంకా తేల్చుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీలో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
2023 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 సెప్టెంబర్ లో వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేసే జీవోను గత ప్రభుత్వం ఇచ్చి ఉంటే వాలంటీర్లను కొనసాగించి వేతనాలు పెంచే వాళ్ళమని చెప్పారు. మే నెల వరకు వాలంటీర్లకు జీతాలు చెల్లించామని, వాలంటీర్ల వ్యవస్థపై విశ్వాసం ఉందని అన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నించామని తెలిపారు.
కానీ, లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలని డోలా ప్రశ్నించారు. వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్ళమని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తాజాగా వీరాంజనేయ స్వామి వ్యాఖ్యల నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే ఉద్దేశం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసి దిశగా వెళుతున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.