మిన్ను విరిగి మీద పడుతున్నా.. చలించని నాయకుడిగా.. తన దైన శైలిలోనే రాజకీయాలు చేస్తారన్న పేరు గడించిన వైసీపీ అధినేత జగన్‌కు.. ఇప్పుడు కూటమి పార్టీలు మరో భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు పలు జిల్లాల్లో స్థానిక సంస్థలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. వాస్తవానికి 2021-22 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఆయా స్థానిక సంస్థల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం.. జెండా మార్చేశారు.
దీంతో కర్నూలు, ఎమ్మిగనూరు, పల్నాడు సహా.. అనేక స్థానిక సంస్థల్లో టీడీపీ పాగా వేసింది. ఇక, కీలకమైన గుంటూరు నగర కార్పొరేషన్‌లోనూ ఇటీవల మేయర్, వైసీపీ నాయకుడు కావటి మనోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పట్టు కోల్పోయే పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఇప్పుడు విశాఖపట్నం నగర కార్పొరేషన్ అంశం కూడా తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఇక్కడ వైసీపీకి బలమై న మద్దతు ఉంది. అయితే.. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు.. జెండా మార్చేశారు.
అయినప్పటికీ.. వైసీపీదే బలమైన మెజారిటీ. ఇదిలావుంటే.. తాజాగా కూటమి పార్టీలకు చెందిన కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గండి బాబ్జి తదితరులు.. మేయర్, వైసీపీ నాయకురా లు గోలగాని హరివెంకట కుమారికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించి.. ఆమెపై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఇది అత్యంత కీలకమైన పరిణామం. టీడీపీ కూటమికి కౌన్సిల్లో మద్దతు లేకపోయినా.. అవిశ్వాస తీర్మానం తర్వా త.. మద్దతు రావడం పెద్ద కష్టం కాదని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 18తో నాలుగేళ్ల పిరియడ్ పూర్తయిన నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఇదే జరిగితే.. వైసీపీ కదలబారి.. కార్పొరేటర్లు టీడీపీ, జనసేన, బీజేపీ పంచకు చేరిపోయే అవకాశం మెండుగా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. విశాఖ పోతున్నా.. వైసీపీ అధినేత జగన్ కానీ ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి కన్నబాబుకు కానీ.. చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని.. విశాఖ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన విశాఖను కూడా నిలబెట్టుకోకపోతే.. పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి జగన్ ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.