మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేలా కనిపించడం లేదు. వంశీకి బెయిల్ మంజూరు అయినప్పటికీ.. జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌పై దాడి, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గన్నవరం కోర్టు వంశీకి బెయిల్ ఇచ్చింది. కానీ టీడీపీ ఆఫీస్‌పై దాడి, కిడ్నాప్ కేసులో కాదు.
భూకబ్జా కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఎనిమిది ఎకరాల భూమి కబ్జా చేశాడని గన్నవరంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ గన్నవరం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు భూకబ్జా కేసులో లోతుగా విచారించేందుకు వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ల మీద ఇటీవల వాదనలు విన్న గన్నవరం కోర్టు.. సోమవారం తీర్పు వెల్లడించింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం.. వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వంశీకి బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. అయితే బెయిల్ వచ్చిన కూడా వంశీ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. టీడీపీ ఆఫీస్‌పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ గట్టిగా ఇరుక్కున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీతో పాటుగా మొత్తం 12 మంది నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది విజయవాడ జైల్లో ఉండగా.. కొమ్మా కోటేశ్వరరావు సహా మరికొంతమంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో బెయిల్ వస్తేనే వంశీ జైలు నుంచి విడుదల అవుతారు.