విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం డీల్ కుదుర్చుకుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రజలకు నష్టమని ఉండవల్లి తెలిపారు.
అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన మహాసదస్సు లో ఈఇద్దరు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఉండవల్లి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పోరాటం మరింతగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వాలు లాభాపేక్షతో వ్యవహరించ వద్దని సూచించారు. ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ప్లాంట్‌ను కలపాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై పిల్ వేస్తే రాజకీయాలకు ముడిపెట్టడం దారుణమని పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుపై ప్రజాఉద్యమం సాగాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. అన్ని పార్టీలు ఎజెండా పక్కనపెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం క్రమేణా సంపన్నుల చేతుల్లో పెట్టేలని చూస్తోందని ఆరోపించారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మిళితం చేయాలని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరున ఉన్న భూములను స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో డీల్ కుదుర్చుకున్నట్టుగా ఉందని కార్మికులు అనుమానించే పరిస్తితి వచ్చిందని, కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకొంటే కేంద్రం ఏమీ చేయదని, దీనిపై పోరాటాలు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయాలని సూచించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైటర్స్ అకాడమీ చైర్మన్ శ్రీ వివి రామమూర్తి గారు నిర్వహించిన మహాసదస్సు కు హాజరైనటువంటి ఉక్కు కార్మిక సంఘాలు, ఉక్కు కార్మికులు. pic.twitter.com/wVpGrFYS4u
— Venkatrao Manga (@manga_venkatrao) November 20, 2022