ఏపీలో అంగన్వాడీలు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను సీఎం అయిన తర్వాత విస్మరించారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు, వైసీపీ నేతల ఇళ్లను కూడా ముట్టడించారు. దాంతోపాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాలుగా వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ అంగన్వాడీలు నిలదీస్తున్నారు. ఏదో ఒక రోజు ప్రభుత్వం తమను చర్చలకు పిలుస్తుందని అంగన్వాడీ కార్యకర్తల సంఘం నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కూడా పట్టించుకోకుండా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు విధుల్లో చేరబోమని వారు తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే తాజాగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.
అంగన్వాడీలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. జనవరి 5వ తేదీలోపే విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసింది. తమ మాట వినకుండా విధులకు హాజరుకాని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రకారం అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు జారీ చేశారు. అయితే, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
దీంతో, ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయవలసిన ప్రభుత్వం దానికి బదులు అల్టిమేటం జారీ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బటన్ నొక్కి జగన్ ను అంగన్వాడీలు ఇంటికి పంపిస్తారని విమర్శిస్తున్నారు.