నింగి విరిగి నేలపై పడుతున్నా.. టాలీవుడ్ స్పందించదా? అంతా మనకెందుకులే.. ఎక్కడ మనమీద మరకలు పడతాయో.. అనే దోరణిలోనే ఉంటుందా? చేతులకు మట్టి అంటకుండా.. సేఫ్ అవ్వాలని భావిస్తుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకు లు.
తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం.. చంద్రబాబు, ఆయన సతీమణిపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు.. అనరాని మాటలు అన్నారని.. ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతోంది. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ స్పందిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ.. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రకటిస్తున్నారు.
చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు.. సినీ ఇండస్ట్రీ కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపింది. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి.. మద్దతు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానిం చారు.
ఇక, బహుభాషా నటుడు.. సోనూసూద్ కూడా చంద్రబాబుకు మద్దతు నిలిచారు. ఇలాంటి వినేందుకు కూడా తాను ఇష్టపడనని.. మీరు స్వయంగా ఎంతో బాధలో ఉన్నారని.. మీ బాధను వర్ణించడానికి మాటలు కూడా చాలవని ఆయన ఫోన్ చేసి చంద్రబాబును పరామర్శించారు. అయితే.. టాలీవుడ్ నుంచి ముందో వెనుకో రాజకీయాలతో సంబంధం ఉన్న నాగబాబు, అశ్వనీదత్ తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు.
పోనీ.. దీనిని రాజకీయం.. మనకెందుకులే అనుకున్నా.. ఒక ఆడబిడ్డకు అందునా.. అన్నగారు.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రీతీక అయిన ఎన్టీఆర్ కుమార్తెకు జరిగిన అవమానాన్ని కూడా వారు ఈ దృష్టిలో ఎందుకు చూడలేకపోతున్నారనేది ప్రశ్న. నిజానికి ఇప్పుడు `శుక్రవారం అసెంబ్లీ` ఘటన, అనంతరం చంద్రబాబు కన్నీరు పెట్టడం.. బోరున విలపించడం వంటి ఘటన లపై యావత్ దేశం నివ్వెరపోయింది.
దీంతో మనసున్న ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై స్పందించారు. రాసేవారు.. రాశారు. మాట్లాడేవారు మాట్లాడారు. నేరుగా మీడియా ముందుకు వచ్చేవారు వచ్చారు. చంద్రబాబుకు పోన్ చేసేవారు చేసి.. సానుభూతి తెలిపారు అందరూ.. ఏదో ఒక రూపంలో రియాక్ట్ అయ్యారు.
మరి ఆయనతో లబ్ధి పొందిన.. టాలీవుడ్ పెద్దలు.. ఒక్కరంటే.. ఒక్కరైనా స్పందించారా? కనీసం.. తటస్థ వైఖరిని అవలంభించే తమ్మారెడ్డి భరద్వాజ్ వంటివారు కూడా మౌనంగా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. గతంలో చిరంజీవి కావొచ్చు, నాగార్జున కావొచ్చు.. చంద్రబాబు హయాంలో లబ్ధి పొందారు.
ఇక, మురళీమోహన్, రాఘవేంద్రరావు వంటివారు.. పార్టీలో కీలకరోల్ పోషించారు. టికెట్లు తెచ్చుకున్నారు. గెలిచిన వారు గెలిచారు. ఓడిన వారు ఓడారు. మరి .. వీరంతా ఏమయ్యారు? ఎక్కడ దాక్కున్నారు? జగన్కు భయపడుతున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఒక్క జనసేన నాయకుడు, పవర్ స్టార్ మాత్రమే స్పందించారు.అ ది కూడా పార్టీ తరఫున ఖండిస్తున్నట్టు చెప్పారు.
మరి చంద్రబాబు హయాంలో స్టూడియోలు కట్టుకున్నవారు.. బ్లడ్ బ్యాంకులు పెట్టుకున్నవారు.. వ్యాపారాలు విస్తరించుకున్నవారు .. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదే అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇప్పుడు చంద్రబాబుకు బాసటగా నిలిచిన రజనీకాంత్ కానీ, సోనూ సూద్ కానీ.. ఎప్పుడూ.. ఒక్కరూపాయి.. చంద్రబాబు నుంచి ప్రయోజనం పొందలేదు.
మరి దీనిని బట్టి.. మన టాలీవుడ్ ఎవరికోసం.. పనిచేస్తోంది. కనీసం మహిళలకు అన్యాయం జరిగితే.. తెరమీద కెమేరా పులుల మాదిరి.. స్పందించేందుకే ఉంటుందా? అనేది ప్రశ్న.