ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ, ఈడీ విచారణలకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, కేటీఆర్ విచారణ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నారు.
ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారణ జరిపింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారను. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ మినహా మరెవరినీ అనుమతించలేదు. కేటీఆర్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది.
విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. మంత్రిగా తాను తీసుకున్న అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్ణయాల్లో హైదరాబాద్ ఈ-కార్ రేసు ఒకటని అన్నారు. ఆనాడు రేసర్లంతా హైదరాబాద్ నగరాన్ని కీర్తించారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తనకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచివేయలేవన్నారు. రూ. 46 కోట్లను బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో పారదర్శకంగా చెల్లించిన తర్వాత… అందులో అవినీతి ఎక్కడ? మనీ లాండరింగ్ ఎక్కడ? అని ప్రశ్నించారు.