తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సభలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య వాగ్వాదం వివాదానికి దారి తీసింది.
కాంట్రాక్టర్ల సమస్యలను కోమటిరెడ్డి ప్రస్తావించగా..దానిపై తలసాని స్పందించారు. కోమటిరెడ్డి కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నారని తలసాని ఎద్దేవా చేయడంతో దానికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
పేకాటాడిన వాళ్లు మంత్రులు కావొచ్చు గానీ.. కాంట్రాక్లర్లు ఎమ్మెల్యేలు కావొద్దా అని రాజగోపాల్ రెడ్డి విమర్శించడంతో టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తలసాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాజగోపాల్, వాళ్ల పార్టీ ఫ్రస్టేషన్ చాలా విచిత్రంగా ఉందని, కుసంస్కారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలోనూ, బయట కూడా వాళ్ల పార్టీ అధ్యక్షుడు నోటికి హద్దు, అదుపు లేదని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను కార్యకర్తలు జరుపుకుంటుంటే…3 రోజుల పాటు సంతాప దినాలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలల్లో 98 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి, అడ్రస్ లేకుండా పోయిన ఫ్రస్టేషన్లో కాంగ్రెస్ నేతలున్నారని, కేసీఆర్‌కు చెకప్ చేయించుకోవడానికి హాస్పటల్ కు వెళితే…బీజేపీ రిజల్ట్స్ చూసి హాస్పిటల్‌కు పోయారని రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం ఏం సంస్కారమని ప్రశ్నించారు.
అవినీతి అవినీతి అని గొంతు చించుకోవడం సరికాదని, ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ భోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఏ నుంచి జడ్ దాకా, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యుల పార్టీ వాళ్లదని ఎద్దేవా చేశారు. అయితే, ఆ తర్వాత తను టంగ్ స్లిప్ అయ్యానని గ్రహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.