గతాన్ని గుర్తు పెట్టుకున్నోళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందునా.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ లాంటి గడుసు వ్యక్తులతో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. అందుకు భిన్నంగా.. వ్యవహరిస్తే తాజాగా పేర్ని నాని కి ఎదురైన అనుభవమే ఎదురవుతుంది. తన మాటలతో నడిరోడ్డు మీద బట్టలు విప్పదీసి నిలుచోబెట్టిన చందంగా జేసీ మాటల తీరు ఉందని చెప్పాలి.
అక్రమంగా పేదల బియ్యాన్ని భారీ ఎత్తున అమ్ముకుంటున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత.. మాజీ మంత్రి పేర్ని నానికి దిమ్మ తిరిగే వ్యాఖ్యలు చేయటమే కాదు..కొద్ది నెలల క్రితం నాటి పరిస్థితుల్ని గుర్తు చేయటం ఆసక్తికరంగా మారింది.అధికారం చేతికి వచ్చిన తర్వాత సహజంగా మర్చిపోయే విషయాల్ని జేసీ గుర్తు చేయటమేకాదు.. తాము తలుచుకుంటే అవేమీ పెద్ద విషయాలు కావన్నట్లుగా ఉన్న జేసీ మాటలకు తెలుగు తమ్ముళ్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మాత్రం ఫైరింగ్ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నానిని ఉద్దేశిస్తూ జేసీ చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. చంద్రబాబు మంచితనంతో ఐదు నెలలకే వైసీపీ నేతలు రోడ్ల మీదకు వస్తున్నారని.. ఆయన తమ చేతులు కట్టేసినట్లుగా వ్యాఖ్యానించిన జేసీ.. ‘‘చంద్రబాబు వయసు కూడా చూడకుండా నంద్యాలలో అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆ రోజు భువనేశ్వరి.. లోకేశ్.. బ్రాహ్మణి.. బంధువులు ఏడ్చటం గుర్తు లేదా?’ అని పేర్నినానిని ప్రశ్నించారు.
రాజకీయ కక్ష సాధింపుతో తన ఇంటి ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన పేర్ని నానిపై నిప్పులు చెరిగిన జేసీ.. ‘‘మంత్రి కొల్లు రవీంద్ర.. అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారు. ఆ రోజు మీరంతా ఆనందించారే.పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిల్లు చేసుకున్నాడని పలుమార్లు అన్నావు. ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నారు. ఈ రోజు ఆయన అనుకుంటే మీరెక్కడ ఉంటారు? నన్ను 120 రోజులు జైలులో పెట్టారు.
ఎంత క్షోభ అనుభవించానో తెలుసా? మా మీద కేసులు పెట్టినప్పుడు మాకూ భార్య..కొడుకు.. కోడలు లేరా? ఇప్పుడు ఆడవాళ్ల గురించి మాట్లాడతారా పేర్ని నాని?’’ అంటూ మళ్లీ నోటి నుంచి మాట రాకుండా ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో 1.12 ఎకరాల్లో నిర్మించిన గోదాం నీది కాదా? అంటూ పేర్ని నానిని సూటిగా ప్రశ్నించిన జేసీ.. పేదల బియ్యం అమ్ముకుంటున్నావు.. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే నీ చరిత్ర బయటపెడతానంటూ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చేయటం గమనార్హం. జేసీ సంచలన వ్యాఖ్యలకు రోటీన్ తరహాలో పేర్ని నాని మాట్లాడతారా? మౌనాన్ని ఆశ్రయిస్తారా? అన్నది చూడాలి.