టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ భరోసా యాత్ర 3వ రోజు తిరుపతిలో కొనసాగుతోంది. ఏర్పేడు మండలం మునగళ్లపాళ్యం గ్రామంలో యంగిటీల వసంతమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వసంతమ్మ కుటుంబానికి అండగా ఉంటామన్న భువనేశ్వరి వారి కుటుంబసభ్యులకు రూ.3 లక్షల చెక్ ను అందజేశారు.
మరోవైపు, భువనేశ్వరికి టీసీఎల్ ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల గ్రామంలో టీసీఎల్ ప్రతినిధులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. రూ. 3,500 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ సంస్థను చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేశారని, దీని 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానని భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానని, తన పర్యటనలో జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఎంతో ఊరటనిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన మంచి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి జనం తనకు చెబుతున్నారని అన్నారు. మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.