అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాసాంధ్రులకు సంబంధించిన ప్రముఖ సంఘం తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్ష పదవికి ‘జయశేఖర్ తాళ్లూరి’ వీడ్కోలు పలికారు. 2019 నుంచి 2021వరకు సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, 2021 నుంచి 2023 వరకు కొనసాగనున్న కొత్త బృందానికి అభినందనలు తెలుపుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో గడచిన రెండేళ్లలో తన ఆధ్వర్యంలోని ‘తానా’ చేసిన కృషిని గుర్తు చేసిన ‘తాళ్లూరి’, రానున్న రెండేళ్లలో కొత్తగా బాధ్యతలు చేపడుతున్న బృందానికి తన సంపూర్ణ సహకారం అందించనున్నట్లుగా కూడా ప్రకటించారు.
ఈ సందర్భంగా గడచిన రెండేళ్లలో తన ఆధ్వర్యంలో ‘తానా’ పలు కీలకమైన కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. అనుకున్న దానికంటే మెరుగైన పనితీరు కనబరడంలో సంఘంలోని సభ్యులందరి కృషి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. సాధ్యమైన మేరకు శక్తివంచన లేకుండా సంఘం తరఫున లెక్కలేనన్ని కార్యక్రమాలు చేపట్టామని, ఇందుకు వాలంటీర్లు, దాతల సహకారం మరువలేనిదని కూడా ‘తాళ్లూరి’ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక ‘తానా’ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను దిగిపోతున్న కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఘనంగా నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. ఈ తరహా పరిస్థితిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో ఆహారం లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే.. పెద్ద ఎత్తున ఖర్చుతో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించరాదన్న భావనతోనే దేవుడు ఇలా చేశారని ‘తాళ్లూరి’ వ్యాఖ్యానించారు.
గడచిన రెండేళ్లలో సంస్థ తరఫున శక్తి వంచన లేకుండా కార్యక్రమాలు నిర్వహించిన తాను, ఇకపై కొత్తగా బాధ్యతలు చేపడుతున్న బృందానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. కొత్త బృందానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. కొత్త బృందం కూడా ఇదివరకటి బృందాల మాదిరే ‘తానా’ ప్రతిష్ఠను పెంచేలా కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ‘తానా’ కార్యవర్గం మారుతున్న సందర్భంగా ఏటా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో తన వీడ్కోలును ఇలా ఓ ప్రకటనతో ‘తాళ్లూరి’ ముగించిన వైనం ‘తానా’ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తిందని చెప్పాలి.