ఏపీలో కొద్ది రోజుల క్రితం సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తగ్గించిన టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాత లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,రేట్లపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని బాహాటంగా చెప్పారు. టికెట్ రేట్లు తగ్గిస్తే థియేటర్లు మూసుకోవడమేనని, నిర్మాతకు టికెట్ ధర నిర్ణయించుకునే అవకాశం ఉండాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ కామెంట్ల నేపథ్యంలోనే వైజాగ్ లో సురేష్ బాబుకు చెందిన స్థలాల వ్యవహారంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ప్రచారం జరిగింది. అయితే, అది తన వ్యక్తిగతమని, ఆ వ్యవహారాన్ని తానే సాల్వ్ చేసుకోగలనని, దాన్ని ఇండస్ట్రీకి ముడిపెట్టి అందరి సాయం అడిగేంత చేతగానోణ్ణేమీ కాదని సురేష్ బాబు అన్నట్లు పుకార్లు వినిపించాయి. ఆల్రెడీ తనవి 80% థియేటర్స్ మూసేశానని, అవసరమైతే ఇకపై తీసే సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తానని సురేష్ బాబు అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ కామెంట్ల తర్వాత చాలాకాలంగా సురేష్ బాబు సైలెంట్ గా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సురేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ పట్నంలో గొప్ప పేరున్న థియేటర్ ను సురేష్ బాబు అమ్మేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ తరహాలోనే వైజాగ్ లో ఫేమస్ అయిన జ్యోతి థియేటర్ ను సురేష్ బాబు వదులుకున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో టాక్ వస్తోంది.
ఏపీలో రాజకీయ పరిస్థితులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు వంటి కారణాల నేపథ్యంలో సురేష్ బాబు ఆ థియేటర్ ను వదులుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు నుంచి జ్యోతి థియేటర్ ను విజయనగరానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారని, వారు ఈ థియేటర్ ను కూల్చేసి అక్కడ 10 అంతస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. జగన్ దెబ్బకు బడా నిర్మాత సురేష్ పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న నిర్మాతలు, థియేటర్ల యజమానుల పరిస్థితి ఇంకెంత వరెస్ట్ గా ఉందో అని టాక్ వస్తోంది.