గత ఏడాది మే 14న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అర్ధరాత్రిపూట అక్రమంగా అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కస్టడీలో రఘురామపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి కొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఆ తర్వాత రఘురామ బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. అయితే, తన తండ్రిని అరెస్ట్ చేసిన తీరు, తదనంతర పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) గతంలోనే స్పందించింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరపాలని ఏపీ సీఐడీ డీజీని ఆదేశించింది.
అయితే, ఈ తర్వాత ఏపీ సీఐడీ అధికారులు తన తండ్రిపై దాడి చేశారంటూ సుప్రీం కోర్టులో భరత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 2 వారాల్లోగా ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గతంలో నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్ దాఖలు చేయని కారణంగా మరో రెండు వారాల పాటు సీబీఐకి సమయం ఇచ్చింది. అ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాత లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని సుప్రీం కోర్టు ఆదేశేంచింది. దీంతో, ఈ వ్యవహారంపై సీబీఐ, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఎలా ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, గత ఏడాది మే 14న ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని.. గుంటూరుకు తీసుకెళ్లి అక్కడ కస్టడీలో తనపై దాడి చేశారని రఘురామ కోర్టులో ఆరోపించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. ఆర్మీ హాస్పిటల్ రిపోర్టు ప్రకారం.. ఎంపీ ఎడమ కాలి వేలు ఫ్రాక్చర్ కావడంతో పాటు.. మరికొన్ని గాయాలు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత కోర్టు రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలోనే భరత్ దాఖలు చేసిన పిిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతోంది.