కాంగ్రెస్ అగ్రనేత, గాంధీల వారసుడు రాహుల్‌గాంధీని చూస్తే.. ఇతర పార్టీల నాయకులకు జాలేస్తోందట. ఆయనపై నమోదైన కేసు.. గుజరాత్లో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు.. తర్వాత.. ఆయనపై పడిన వేటు.. ఇలా అన్నీ కూడా ఎక్కడా తెగడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఈ కేసునుంచి బయట పడలేక పోతున్నారు. ప్రస్తుతానికి ఆయన బెయిల్‌పై ఉన్నా.. ఎన్నికల సమయం ముంచుకు వస్తుండడంతో అప్పటికైనా ఇవి ఒక కొలిక్కి వస్తాయా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
తాజాగా తీవ్ర ఇరకాటం!
కర్ణాటకలో గతంలో 2018లో జరిగిన ఎన్నికల సమయంలో `మోడీ` ఇంటి పేరు ఉన్నవారంతా.. బ్యాంకులను మోసం చేశారు.. వారంతా మోసానికి చిరునామా! అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నాయకుడు పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిని విచారించిన సెషన్స్ కోర్టు.. తీవ్ర నేరంగా పరిగణించి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో వెంటనే బెయిల్ పొందిన రాహుల్ ఈ కేసును కొట్టేయాలని తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
కానీ, ఆయనకు అక్కడ ఊరట లభించలేదు. పైగా.. గుజరాత్ హైకోర్టు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. “మీరేమీ అమాయకులు కాదు రాహుల్. మీపై ఇంకా చాలా కేసులు పెండింగులో ఉన్నాయి“` అని హై కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. తాజా కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాదు.. `రాహుల్.. దోషి` అని ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసేందుకు కూడా నిరాకరించింది.
రాహుల్ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని తెలిపింది. వీర్ సావర్కర్ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసింది. ఆయనపై 8 క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదై, విచారణలో ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఆయనను దోషిగా నిర్థరిస్తూ ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ పరిణామం రాహుల్‌కు శరాఘాతంగా మారిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించవలసి ఉంటుంది. అయితే.. ఎన్నికలకు సమయం మించి పోతుండడంతో దీనిపై తీర్పు ఎప్పటికి వస్తుందనేది కూడా.. రాహుల్‌కు టెన్షన్‌గానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.