చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఓ వాటర్ ప్లాంట్ను నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అయితే, గత మూడేళ్లుగా వాడకంలో లేని ఈ ప్లాంట్ పున:ప్రారంభ కార్యక్రమం సందర్భంగా మునిసిపల్ అధికారులకు, పత్తిపాటి పుల్లారావుకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో వేసిన రెండు బోర్లకు అనుమతులు లేవని, అందుకే అక్కడ తదుపరి చర్యలు నిర్వహించరాదని అధికారులు నోటీసులు జారీచేశారు.
ఈ విషయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్లాంట్ వద్ద అధికారులు, పోలీసులకు, పత్తిపాటి అనుచరులకు మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్తిపాటి పుల్లారావుపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ ప్లాంట్ పున:ప్రారంభ సమయంలో తనను కులం పేరుతో దూషించారని టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ కోడిరెక్క సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్తిపాటితో పాటు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావులను చేర్చారు. తనపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయని ఆమె ఫిర్యాదు చేశారు.
అయితే, ప్రత్తిపాటిపై జగన్ సర్కార్ కక్షపూరితంగానే కేసు పెట్టించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ప్రశాంతంగా చేపట్టిన వాటర్ ప్లాంట్ పున:ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఇలా అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రభుత్వ అధికారులు కూడా జగన్ చెప్పినట్లు చేస్తూ ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, రేపు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, బదులు తీర్చుకుంటామని అంటున్నారు.