కొందరు చిన్న, మిడ్ రేంజ్ నటులకు పెద్ద సినిమాల్లో అవకాశం వస్తుంది కానీ.. వాళ్లు నటించిన ఎపిసోడ్లు ఎడిటింగ్ టేబుల్‌ను దాటి బిగ్ స్క్రీన్ మీదికి వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. చాలా సన్నివేశాల్లో నటించినా వాటిలో చాలా వరకు కత్తెరకు బలైపోయి తక్కువ స్క్రీన్ టైంకు పరిమితం అయిపోతుంటారు. కొన్నిసార్లు ఆ తక్కువ టైం కూడా లేకుండా మొత్తంగా సినిమాలో తమ పాత్రే లేకుండా లేచిపోతుంటుంది. తాను కూడా అలా ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించకుండా వెళ్లిపోయానని అంటున్నాడు యువ నటుడు సత్యదేవ్. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు సత్యదేవ్. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో విలన్ పాత్రలో అతను అదరగొట్టిన సంగతి తెలిసిందే. వచ్చే వారం తన కొత్త చిత్రం జీబ్రా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ పాత్ర చేసినా, అది తెర మీదికి రాని విషయాన్ని వెల్లడించాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకు చెప్పుకోదగ్గ పాత్రే దక్కిందని.. తాను చాలా రోజులే చిత్రీకరణలో పాల్గొన్నానని.. దాదాపు 15 నిమిషాలు తెరపై కనిపించే పాత్ర తనదని సత్యదేవ్ వెల్లడించాడు. కానీ నిడివి ఎక్కువైపోవడం వల్లో, సినిమాలో సింక్ కాకపోవడం వల్లో ఆ ఎపిసోడ్ మొత్తాన్ని ఎడిటింగ్ టైంలో తీసేశారని.. అది డైరెక్టర్ నిర్ణయం కాబట్టి దాన్ని గౌరవించాల్సిందే అని సత్యదేవ్ అన్నాడు. దీని గురించి ఆ సినిమా రిలీజ్ టైంలో కానీ, తర్వాత కానీ తాను చెప్పుకోలేదని.. అలా చేయడం కరెక్ట్ కాదు అనిపించిందని సత్యదేవ్ వెల్లడించాడు. కానీ సినిమాకు ఏది మంచో అది చేశారు కాబట్టి తన పాత్ర తెరపై కనిపించలేదనే బాధ లేదని సత్యదేవ్ చెప్పాడు.
ఇక జీబ్రా విషయానికి వస్తే ఇది తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన థ్రిల్లర్ మూవీ. తమిళ నటి ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయికగా నటించగా.. కన్నడ నటుడు డాలీ ధనంజయ కీలక పాత్ర పోషించాడు. కమెడియన్ సత్య, సత్యరాజ్, సునీల్, అమృత అయ్యంగార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది.