తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన నాయకుడికి.. తెలంగాణ ప్రజల మనోభావాలు.. ఇక్కడి ప్రజల బాధలు ఎలాతెలుస్తాయని నిలదీశారు.
తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోడీ.. పార్లమెంటులో అవాకులు చెవాకులు పేలారని.. తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు సెంటిమెంట్లను రెచ్చగొడుతుంటారని విరుచుకుపడ్డారు.
దిష్టి బొమ్మలు తగలబెట్టండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపే తీర్మానంపై మోడీ ప్రసంగించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అనుసరించిన తీరును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. ఇందుకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మను దగ్దం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.
వాజ్‌పేయి మోసం చేశాడు!
తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరుణ్‌జైట్లీని మేనేజ్ చేసి మోడీ పదవులు పొందారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని బీజేపీ తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. 1999లోనే తెలంగాణ ప్రాంతంలో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలిచిందన్న ఆయన… తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి వాజ్‌పేయి మోసం చేశారన్నారు. వాజ్‌పేయి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయి చూపారని గుర్తుచేశారు.
అప్పుడే ఇచ్చి ఉంటే.. ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా?
ఎన్డీఏ తొలి ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే వందలమంది ప్రాణాలు పోయేవి కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. వందల మంది ఆత్మబలిదానాలకు ఒక రకంగా బీజేపీనే కారణమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా నాయకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా… సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కొనియాడారు. ఒక ప్రాంతం(ఏపీ)లో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు తలుపులు పెట్టడం ఎప్పుడూ జరిగేదేనన్నారు.
తెలంగాణకు అన్ని విధాలా అవమానాలే!
“1999లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. 1999 నుంచి 2004 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణను ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రజల త్యాగాలను, పోరాటాలను బీజేపీ అవమానించింది. నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీరు కాకినాడ తీర్మానం ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకునేవారు కాదు. వారి మరణాలకు బీజేపీనే కారణం“ అని రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi should apologize to #Telangana people on behalf of BJP for delaying statehood & thereby leading to the sacrifices of hundreds of lives.
BJP promised One Vote,Two States & came to power in 1999,but failed To give Telangana.Instead three other states were given statehood. pic.twitter.com/N2KC86TCIx
— Revanth Reddy (@revanth_anumula) February 8, 2022