ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను ఉపయోగించుకొని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచించారు. కానీ ఈసీ ఆయనకు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను విధుల్లో నుంచి తప్పించింది. దాంతో జిల్లాల వారీగా లక్ష మందికి పైగా వాలంటీర్లు పోటా పోటీగా రాజీనామా చేసి జగనన్న సైన్యం గా మారారు. ప్రత్యక్షంగా అధికార పార్టీ ప్రచారాల్లో పాల్గొన్నారు.
కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు రివర్స్ అయ్యారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు మరియు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్ళ వల్లే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. తమకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ ప్రచారంలో పాల్గొనేలా చేసిన వారిపై కేసులు పెట్టి రావాలని వాలంటీర్లకు టీడీపీ మంత్రులు తాజాగా సూచన చేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్పొరేటర్లు మరియు నేతలపై రాజీనామా చేసిన వాలంటీర్లు కేసులు పెడుతున్నారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని బెదిరించి తమచేత రాజీనామాలు చేయించారని, తమ జీవితాలను రోడ్డున పడేశారని నెల్లూరు లాంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు కొందరు వాలంటీర్లు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీ నేతలకు జగనన్న సైన్యమే శాపంగా మారింది. మూకుమ్మడిగా వాలంటీర్లు కేసులు పెడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది.