ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి రాపాక వరప్రసాద్ ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ కొద్ది రోజులకే జనసేనను వీడి వైసీపీ గూటికి చేరారు. ఆ సమయంలో జనసేనతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా రాపాక విమర్శలు గుప్పించారు.
కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి లక్షల ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత వైసీపీని వీడిన రాపాక.. ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి జనసేనలో ఉండి ఉంటే ఈపాటికి రాపాక మంత్రి అయ్యుండేవారు. 2019 ఎన్నికల్లో గెలవడంతో.. గత ఏడాది ఎన్నికల్లోనూ ఆయనకు రాజోలు సీటు దక్కది. కూటమి సపోర్ట్ తో జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన భారీ మెజారిటీతో మరోసారి గెలిచి ఉండేవారు. ఎస్సీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కేది.
కానీ జనసేనకు హ్యాండిచ్చి వైసీపీలో చేరడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అయింది. 2024 ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ టికెట్ ను మరొక నేతకు ఇచ్చిన జగన్.. రాపాకను అమలాపురం పార్లమెంట్ కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో వైకాపాతో ఆయన తెగదెంపులు చేసుకున్నారు. మళ్లీ జనసేనలో చేరే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీలో చేరేందుకు రాపాక వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజోలు టీడీపీకి నాయకత్వం లేదు.
2024 ఎన్నికలకు ముందు రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దూకి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరి రాజోలు బాధ్యతలు చేపట్టాలని రాపాక వరప్రసాద్ భావిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులను కలిసి టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ కూటమి పార్టీల్లో ఎవరు చేరాలన్నా ఇతర పార్టీల అంగీకారం చాలా అవసరం. కాబట్టి, టీడీపీలో రాపాక చేరికకు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.