టీటీడీ ఛైర్మన్, వైసీపీ కీలక నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి కాళ్ల దగ్గర రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మోకరిల్లిన ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అలా మోకరిల్లడాన్ని శెట్టి బలిజలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే తాజాగా వేణుగోపాలకృష్ణకు తన సొంత జిల్లాలోనే ఘోర పరాభవం ఎదురైంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వేణుగోపాలకృష్ణకు నిరసన సెగ తగిలింది.
అమలాపురంలో వైఎస్ఆర్సీపీ సమావేశానికి వచ్చిన మంత్రి వేణు ఎదుట శెట్టిబలిజ సామాజిక వర్గీయులు ఆందోళన చేశారు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డగించిన శెట్టి బలిజ కులస్తులు ఆయనను ఘెరావ్ చేసి ఆందోళన చేపట్టారు. వేణుగోపాలకృష్ణను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తమ సామాజిక వర్గానికి చెందిన ఇంకో నేతకు మంత్రి పదవినివ్వాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు మోకరిల్లితే తప్పు లేదని, కానీ శెట్టిబలిజ కులం పేరు చెప్పుకుని సుబ్బారెడ్డి కాళ్లమీదపడడం సిగ్గుచేటని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు, అమలాపురంలోని శెట్టిబలిజ గ్రంథాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సమావేశం సందర్భంగా.. వైవీ కాళ్ల వద్ద మంత్రి వేణు మోకరిల్లడంపై ఆ సంఘం నాయకులు మండిపడుతున్నారు. రాగద్వేషాలకు అతీతంగా, భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన మంత్రి వేణుగోపాలకృష్ణ తన పబ్బం గడుపుకోవడానికి శెట్టిబలిజ కులాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
కాగా, వైవీ కాళ్ల వద్ద మోకరిల్లిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లకు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని చెప్పారు. ఈ వీడియోను టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఇంకెన్నాళ్లు బానిసలుగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శలు ఘాటుగా విమర్శలు గుప్పించడంతో శెట్టి బలిజ నేతలు నేడు మంత్రిని ఘెరావ్ చేశారు.