సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వంటి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఆ పోస్టులు పెట్టించారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే రాఘవ రెడ్డి ని పోలీసులు తాజాగా నేడు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో బెయిల్ కోరుతూ రాఘవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయం వెలువడిన తక్షణమే రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం రాఘవరెడ్డిని పులివెందుల పోలీస్ స్టేషన్ తరలించారు. దాంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్న రాఘవరెడ్డి ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టులో పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్ను కూడా కడప కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టును రాఘవ రెడ్డి ఆశ్రయించడంతో కొన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా, సోషల్ మీడియా పోస్టుల కేసులో రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరి, రాఘవ రెడ్డిని అరెస్టు చేస్తారా లేక విచారణ చేసి వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది.