దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టి నరేంద్ర మోదీ.. న్యూ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. సుమారు 6,000 మంది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. జెండా వందనం అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోదీ సుధీర్గంగా ప్రసంగించారు. ఈ క్రమంలోనే స్వాత్రంత్య్ర దినోత్సవం వేళ ఆయన నెవర్ బిఫోర్ రికార్డును సృష్టించారు.
ఇరవై ముప్పై కాదు ఏకధాటిగా 98 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగం గంటన్నరకు పైగా కొనసాగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించి అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. ఇప్పుడు 98 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1947 లో 72 నిమిషాల పాటు ప్రసంగించారు. మోదీకి ముందు వరకు నెహ్రూ పేరిట అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు ఉంది. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పుడు 65 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత 2015లో 85 నిమిషాలు, 2016లో 94 నిమిషాలు, 2017లో 56 నిమిషాలు, 2018లో 83 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2020లో 86 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, 2022లో 83 నిమిషాలు మరియు 2023లో 90 నిమిషాలు మోదీ ప్రసంగించడం జరిగింది.