విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. “ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికతల గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన పోషించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను అభిమానులు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తాం” అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే మోదీ ట్వీట్ పై టీడీపీ అధినేత, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబు స్పందించారు. “నిజంగా… ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది, మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా, అన్నగారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు గొప్ప సంస్కరణవాది అని, రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారని కొనియాడారు. పురాణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన మహానటుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి గుండె చప్పుడు అని, రాజకీయాల్లోకి అడుగుపెట్టి నవశకానికి బాటలు వేశారని అన్నారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసి, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ఎన్టీఆర్ అని పొగిడారు.