టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, తమ మెగా హీరో బర్త్ డేను ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకున్నారు. బర్త్డే కేక్ కటింగ్ లు, కటౌట్లకు పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాలతో చిరుపై తమ అభిమానాన్ని ఫ్యాన్స్ చాటుకున్నారు. ఈ క్రమంలోనే చిరుకు ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
‘‘నా ప్రియమైన సోదరుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను గౌరవించే, ఆరాధించేే సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. అన్యయ్య… తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా గొప్ప అనుభూతి కలుగుతుంది. చిరంజీవి జీవితం తెరిచిన పుస్తకం. చెమటోడ్చి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సాయం చేశారు.
అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగుండే లక్షణం. ప్రతి నమస్కారం చేయని కుసంస్కారి అయినా నమస్కరించే సంస్కారం చిరంజీవిది. అలాంటి అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం పూర్వజన్మ సుకృతం” అని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, సినిమా టికెట్లు ధరల విషయంలో జగన్ తో మీటింగ్ సందర్భంగా చిరంజీవి రెండు చేతులు జోడించి జగన్ కు నమస్కారం చేయడాన్ని పవన్ ఇక్కడ ప్రస్తావించినట్లు కనిపించడం విశేషం.
ఇక, చిరు బర్త్ డే సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ‘‘20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్ రీజన్ ఫర్ ఎవ్రీగాన్ థింగ్, కిల్ హిమ్’ అంటూ చిరుకు భారీ ఎలివేషన్ తో సాగే టీజర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.