సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా జగన్ పై పవన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబును జైల్లో పెట్టించిన జగన్ ఐదేళ్లుగా బెయిల్ పై ఉన్నాడని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు వంటి నాయకుడిని తీసుకెళ్లి 53 రోజులపాటు జైల్లో కూర్చోబెట్టారని, కానీ ఆ జైల్లో పెట్టించిన వ్యక్తి ఐదేళ్లుగా బెయిల్ పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై 30 కేసులున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అని ఎద్దేవా చేశారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయనను జైల్లో పెట్టినప్పుడు టిడిపి శ్రేణుల ఆవేదన తనకు అర్థమైందని అన్నారు. టిడిపి నేతలు, కార్యకర్తల బాధను నేరుగా తాను పంచుకోలేకపోయినా దానిని అర్థం చేసుకున్నానని, ఆ క్రమంలోనే రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అందరూ భయపడుతున్న రోజుల్లో తాను వెళ్లి చంద్రబాబును కలిశానని గుర్తు చేసుకున్నారు. వర్మ గారి వంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ టీడీపీ అని, నాలుగు దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ టిడిపి అని చెప్పుకొచ్చారు.
ప్రతి పార్టీలోనూ చిన్నచితకా విభేదాలు సహజమని, వాటిని అధిగమించి ముందుకు పోయి కూటమిని గెలిపించుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని మార్చేస్తామన్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, తాను పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టిడిపి, జనసేన, బిజెపి మద్దతుదారులను పవన్ కళ్యాణ్ కోరారు.
పిఠాపురంలో వర్మ గారి సహకారం మరువలేనిదని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని సమస్యలపై ఇద్దరం కలిసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ దిశగా తాను కూడా కృషి చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.