ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓ వైపు సీట్ల ఎంపిక, అభ్యర్థుల మార్పు, సిట్టింగ్ స్థానాలలో చలనం వంటి వ్యవహారాలతో వైసీపీ అధినేత జగన్ బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ తొలి జాబితా విడుదల చేసే దిశగా టీడీపీ-జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
చంద్రబాబుతోపాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్…చంద్రబాబు లోకేష్ లతో కీలక సమావేశం జరిపారు. రాబోయే ఎన్నికలలో సీట్ల పంపకం, సీట్ల సర్దుబాటు, వలస నేతల వ్యవహారం వంటి అంశాలపై వీరు ముగ్గురు చర్చించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే తొలి జాబితాను ఉమ్మడిగా విడుదల చేసేందుకు సిద్ధమవ్వాలని ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.