మీ పరిస్థితి, మీ ప్రభుత్వ పరిస్థితి బాగోలేదయ్యా.. మార్చుకోండి.. అని చెబితే వెటకారం. తగ్గేదేలేదంటూ.. ధీమా!! ఇదీ వైసీపీ మంత్రుల దూకుడు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడినా.. ఈ క్రమంలో కొన్నికీలక విషయాలుచెప్పారు.
ప్రతిపక్ష నేతలపైనా, కార్యకర్తలపైనా కేసులు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ.. రైతులపై చూపించాలని, కనీసం కష్టాల్లో ఉన్న పేదలపైనైనా చూపించాలని ఆయన విన్నవించారు. దీనిలో పవన్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పోనీ.. ఆయన చేసిన సంచలన కామెంట్లు పక్కన పెట్టినా.. మంచిని తీసుకుంటే.. మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, అలా మంచిని తీసుకుంటే.. మంత్రులు ఎలా అవుతాం అనుకున్నారో.. లేక వైసీపీ నేతలం అంతకన్నా ఎలా అవుతామని భావించారో తెలియదు కానీ.. ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్‌లు పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ అన్నదమ్ములను ప్రజలు తిరస్కరించారని రోజా విమర్శించారు. వారాహి వాహనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని అన్నారు. సినీ నటుడుగా పవన్ ను ప్రజలు అభిమానిస్తారు కానీ.. రాజకీయంగా ఆదరించరని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.
గత ఎన్నికల్లో పవన్, తన సోదరుడు(నాగబాబు) సొంత జిల్లాల్లో పోటీ చేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పవన్ మాట తప్పారని ఆక్షేపించారు. నా మాట శాసనం అన్న పవన్.. శాసనసభ గేటును తాకలేకపోయారని విమర్శించారు. పవన్ పార్ట్ టైం రాజకీయాలు ఆపాలని అన్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టాలని మంత్రి రోజా సవాల్ విసిరారు.
అంతేకాదు, జగన్ సీఎం అయితే సన్యాసం తీసుకుంటానని పవన్ అన్నాడని, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నా రో అర్థం కావటం లేదని రోజా వ్యాఖ్యానించారు. “పార్టీ పెట్టిన నువ్వు రెండు సార్లు చిత్తుగా ఓడిపోయావు. మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్‌ని కూడా ప్రజలు ఓడించారంటే ప్రజలకు మీపై నమ్మకం ఎంత ఉందో మీరే ఆలోచించండి. పవన్ వారాహితో వచ్చి గంగలో దూకుతారో, సముద్రంలో దూకుతారో మీ ఇష్టం. మా పార్టీ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలే దేహశుద్ధి చేస్తారు. పవన్ ఎప్పుడైనా రెండు కాళ్ల మీద నిలబడ్డాడా“ అని మంత్రి రోజా నిలదీశారు.
మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఏకమైనా జగన్‌ని ఓడించలేరన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం జగన్ పుట్టిన రోజున స్వప్న అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ దత్తతండ్రిని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు కానీ.. తాను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ చెప్పలేదన్నారు. వారాహి యాత్రలు చేసినా.. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా జగన్‌ను ఓడించలేరన్నా రు. పవన్‌ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని జోగి వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. పవన్‌పై ఎదురు దాడి చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీ మంత్రులు.. ఆయన చేసిన కామెంట్లలో మంచిని మాత్రం గుర్తించలేక పోవడం గమనార్హం. దీంతో నెటిజన్లు.. తస్సాదియ్యా.. ఇది కదా మంత్రుల తీరు!! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.