తమిళ నాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా సాగిపోతున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం.. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో పవర్ లో ఉన్న డీఎంకే కానీ తనకు శత్రువులుగా విజయ్ స్పష్టం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు వీలుగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక ఫార్ములాను సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రిగా.. విజయ్ డిప్యూటీ సీఎంగా ఒప్పందం చేసుకొని అన్నాడీఎంకే.. విజయ్ కు చెందిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) కూటమిగా అవతరిస్తే అధికారం ఖాయమన్న సూచన చేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ ను పరిగణలోకి తీసుకొని విజయ్ రాజీ పడాల్సిన అవసరం ఉందన్న మాట చెప్పినట్లుగా సమాచారం. టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున ఆధ్వర్యంలో 2026 ఎన్నికల వ్యూహాల్ని రచించేందుకు ప్రశాంత్ కిశోర్ టీవీకేతో జత కట్టినట్లుగా చెబుతున్నారు.
విజయ్ తో అన్నాడీఎంకే జత కలిస్తే.. శాశ్విత ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ కూటమిగా అవతరిస్తే డీఎంకేను నిలువరించటం కుదురుతుందని విజయ్ కు పీకే చెప్పినట్లుగా సమాచారం. ఇదే అంశం గురించి అన్నాడీఎంకేతో ప్రశాంత్ కిశోర్ కూడా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అన్నాడీఎంకేకు కనీసం 25 శాతం ఓట్లు ఉంటాయని.. టీవీకే కు అత్యధికంగా 20 శాతం ఓట్లు వచ్చే వీలుందని.. ఈ రెండు పార్టీల కూటమిలోకి మరిన్ని పార్టీలను చేర్చుకుంటే మొత్తం 50 శాతం ఓట్లు దక్కుతాయని.. దీంతో అధికారం ఖాయమని విజయ్ కు పీకే వివరించినట్లుగా చర్చ జరుగుతోంది.
తన వాదనకు బలం చేకూరేలా పీకే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక ఉదాహరణను చూపించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ పొత్తుతో విజయం సాధించారని.. అదే విధంగా పళనిసామి ముఖ్యమంత్రిగా.. విజయ్ డిప్యూటీ సీఎంగా ఒప్పందం చేసుకోవటం ద్వారా ఎన్నికల్లో విజయాన్ని.. చేతికిఅధికారాన్ని సొంతం చేసుకోవచ్చన్న మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఫార్ములాను ఓకే చేసే విషయంలో విజయ్ తర్జనభర్జనలు పడుతున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈ తరహా ఫార్ములాపై కసరత్తు జరుగుతుందన్న అంశంపై టీవీకే నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు బలాన్ని చేకూరేలా ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవటం కోసం రాజకీయ వ్యూహకర్తల వద్ద చర్చలు జరుపుతున్నట్లుగా పేర్కొంటున్నారు. మరోవైపు 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి పీకే సూచన చేసినట్లుగా కూటమికి ఓకే చెప్పి.. ఆ తర్వాతి ఎన్నికలకు సొంతంగా బరిలోకి దిగేలా విజయ్ ఆలోచనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే కాలమే సమాధానమని చెబుతున్నారు.