నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు, ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సంధర్భంగా విజయవాడ కరకట్ట నుండి గన్నవరం విమానాశ్రయం వరకు పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో ఈ పద్దతికి స్వస్తి పలకాలని, తన పర్యటనలలో ఎక్కడా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయాలు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు.
ఇక గత ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు ఇచ్చేందుకు 9 లక్షల కిట్లను సిద్దం చేశారు. దాని మీధ, ఆఖరుకు దానిలోపల చిక్కీల మీద కూడా జగన్ ఫోటోను ముద్రించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో అధికారులు వాటిని పంచాలా ? వద్దా ? అన్న సంశయంలో పడిపోయారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు వాటిని యధావిధిగా పంచాలని ఆదేశాలు జారీచేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబంతో సహా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరుమలలో చంద్రబాబు నాయుడు వెళ్లే దారికి ఇరువైపులా అధికారులు పరదాలను కట్టించారు. తనను ప్రజలకు దూరం చేసే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని అధికారులను హెచ్చరించారు. మొత్తానికి ఈ దఫా కొత్త చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారని నెటిజెన్లు, టీడీపీ, చంద్ర బాబు అభిమానులు ఆనందపడుతున్నారు.