అధికారం చేతిలో ఉంది కాబట్టి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడం తప్పు కాదనుకుందాం….పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం….అధికార పక్షానికి అలవాటే అనుకుందాం…వాస్తవానికి ఇలా చేయడం తప్పే …కానీ, కాసేపు ఇలా చేయడం పెద్ద తప్పు కాదనుకుందాం. కానీ, చెట్టంత కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రోజు…ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోలేక పుట్టెడు దు:ఖంతో వర్థంతి నిర్వహిస్తున్న తండ్రిని అమానుషంగా అరెస్టు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు ఏ పరిస్థితిలో అరెస్టు చేశారో తెలిస్తే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కడుపు రగిపోవడం ఖాయం. తన కుమారుడు నితీశ్ వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తున్న నారాయణను పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా ఏదో తీవ్ర వాదిని, ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లుగా అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
నితీశ్ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఏపీ సీఐడీ పోలీసులు నారాయణ ఇంటి తలుపు తట్టి అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పారు. తన కుమారుడి వర్థంతి సందర్భంగా శోక సంద్రంలో ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామంతో షాక్ అయ్యారు. అయినా సరే, కనికరించని పోలీసలు…వెంటనే నారాయణను అరెస్టు చేశారు. ఆయన సొంతవాహనంలోనే పోలీసులు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలించారు. నారాయణ ఆరోగ్యం సరిగా లేదని చెబుతున్నా పోలీసులు వినలేదు. దీంతో, తన కుమారుడి వర్థంతి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా వదిలేసి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి కూడా బయలుదేరాల్సి వచ్చింది.
సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017 మే 10 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ కుమారుడు నితీశ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నితీశ్తో పాటు ఆయన స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల వయసులో నారాయణ విద్యా సంస్థల వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్న క్రమంలో నితీశ్ చనిపోవడంతో నారాయణ కుటుంబం తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది.
ఈ నేపథ్యంలో ప్రతి ఏటా నితీశ్ వర్ధంతి కార్యక్రమాలను నారాయణ కుటుంబం నిర్వహిస్తోంది. అయితే, మరే రోజూ దొరకనట్లుగా…సరిగ్గా వర్థంతి కార్యక్రమం జరుగుతుండగానే నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జగన్ కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, కనీస మానవత్వం, కనికరం లేకుండా ఇలా ప్రవర్తిస్తున్న జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.