టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక హఠాన్మరణం పాలైన టీడీపీ కార్యకర్తలను నారా భువనేశ్వరి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా భువనేశ్వరి అద్భుతంగా ప్రసంగించారు. తాను తొలిసారి బహిరంగ సభలో మాట్లాడుతున్నానని, తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
‘నిజం గెలవాలి’ కార్యక్రమం తనతోపాటు ప్రజలందరి పోరాటం అని, రాష్ట్రం కోసం, బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం అని అన్నారు. తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారనుకుంటున్నానని చెప్పారు. రాజకీయాలు చేసేందుకు ఇక్కడకు రాలేదని, నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చానని అన్నారు.
చంద్రబాబు వంటి విజనరీపై తప్పుడు కేసులు పెట్టారని, మొదట 3 వేల కోట్లు ఆ తర్వాత 300 కోట్లు ఆ తర్వాత 27 కోట్లు అంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి తప్పుడు కేసులు పెట్టడమే ధ్యాస అని, భయపెట్టడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రానికి ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.