మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపణలు రావడం, ఆ ఆరోపణల ఆధారంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీ రావును, ఆయన కోడలు శైలజ కిరణ్ ను, 30 మంది మార్గదర్శి చిట్స్ మేనేజర్లను ఏపీ సిఐడి పోలీసులు విచారణ జరపడం తెలిసిందే. అయితే, 86 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావును అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సిఐడి అధికారులు విచారణ జరిపిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై మార్గదర్శి సిబ్బంది కొందరు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో, ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న 30 మంది మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ సీఐడీ అధికారులను తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం పై సినీ నటుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
విచారణ పేరుతో రామోజీరావును వేధించడం విచారకరమని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావును, ఆయన కుటుంబాన్ని ఇలా విచారణ అంటూ వేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రామోజీరావుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తెలుగు మీడియా, సినీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన రామోజీరావును నాగబాబు ప్రశంసించారు.
వేలాది మందికి జీవనోపాధిని కల్పించారని, కళా రంగంలో గిన్నిస్ రికార్డు సాధించారని కొనియాడారు. ఈ రకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటిచెప్పిన వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు. రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయం అని, సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని నాగబాబు అన్నారు.