సహజంగా నేటి నాయకులు.. నేటి తరం యువ నేతలు .. తమ ప్రచారంలో ఎంచుకునే ఏకైక సాధనం.. ఎన్నికల్లో ప్రత్యర్థులను తిట్టడమే. వారి లోపాలు ఎండగట్టి.. ఉన్నవీ లేనివీ చెప్పి.. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించేవారు చాలా మంది ఉన్నారు. కానీ.. ఇది నాటి తరం రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగినవారు.. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేసినవారు.. అనుసరించే పద్ధతి, విధానం మాత్రం కానేకావు. ఎందుకంటే.. ఇలాంటి ఫక్తు.. ఎదురుదాడి రాజకీయాలకు వారంతా దూరంగా ఉంటా రు.మరి తాను.. తన కుటుంబం ఒక పద్ధతైన రాజకీయాలు చేస్తామని.. తమ రాజకీయం ఒక పద్ధతిగా ఉంటుందని పదే పదే చెప్పే కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా.. ఇప్పుడు ఈ రొంపిలోకే దిగిపోయారు.
ఇదే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గతంలో పద్మనాభం తండ్రి కూడా రాజకీయాలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ప్రత్యర్థిని పన్నెత్తు మాట అనకుండా.. ప్రజలు, ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రజలకు అండగా ఉంటామని చెబుతూ .. ఓట్లు అడిగేవారని.. కొన్నిరోజుల కిందట పద్మనాభం వైసీపీలో చేరిన తర్వాత.. చెప్పుకొన్న శాంతి వచనాలు. తాము, తమ కుటుంబం అంత పద్ధతిగా ఉన్నామని కూడా.. ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు.. నాయకులను అరె, ఒరే అనే సంప్రదాయం కూడా తమకు లేదన్నారు. “పరస్పరం ఎవరు ఏ పార్టీలో ఉన్నా గౌరవించుకుంటామండి!“ అని కూడా తేల్చి చెప్పారు.
కట్ చేస్తే.. పద్మనాభం సారు.. మరి ఇప్పుడు అదే పద్ధతైన రాజకీయాలు చేస్తున్నారా? కుటుంబ వారసత్వంగా వచ్చిన రాజకీయాలు కొనసాగిస్తున్నారా? అంటే.. ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఆయన నోరు విప్పితే.. పవన్‌పై విరుచుకు పడుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ను సంపాయించుకునేందుకు వచ్చాడని..ప్యాకేజీ స్టార్ అని ఫక్తు వైసీపీలో ఉన్న కొందరు నాయకులు చేస్తున్న విమర్శలనే ఈయన కూడా వండి వారుస్తున్నారు. సినిమాల్లో డబ్బులు చాలడం లేదని.. అందుకే రాజకీయాల్లో అమ్ముడు పోతున్నాడని కూడా .. తాజాగా అనేశారు.
మరి ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు.. “పద్ధతైన రాజకీయాలు చేసే ముద్రగడ కుటుంబానికి“ తగునా? అనేది ప్రశ్న. ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుందని పద్మనాభం ను గురించి అనుకోవాలా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీలో ఉన్నవారంతా.. దాదాపు ఇలానే ఉన్నారని అందరూ అంటున్నారు. కనీసం పద్మనాభం వంటివారైనా.. ఒక పద్ధతైన రాజకీయం చేస్తారని.. పిఠాపురం వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే..ఇక్కడి రెండు మండలాల్లో వైసీపీని గెలిపించే బాధ్యతలను ఆయనే తీసుకున్నారు. కానీ, గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆయన అంచనాకు వచ్చారో ఏమో.. పవన్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. మరి పద్ధతైన రాజకీయం గురించి సారు ఏం సమాధానం చెబుతారో చూడాలి.