అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై అన్ని పక్షాల వాదనలు పూర్తి కావడంతో….ఆగస్టు 25న జరగబోయే తదుపరి విచారణలో తీర్పు వస్తుందని అంతా ఆశిస్తున్నాయి. కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టు…రకరకాల కారణాలతో చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఆ పిటిషన్ విచారణ…దాదాపుగా చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు.
అక్రమాస్తుల కేసుల విచారణలో సాక్ష్యులను జగన్ ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. తన బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే సీఐడీ విచారణ సమయంలో తన పిటిషన్ వెనక్కు తీసుకోవాలని పోలీసులు బెదిరించారని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేశానన్న అక్కసుతో తనను కొట్టించారని ఆరోపించారు.
తన కాలికున్న దెబ్బలే సాక్షాలని రఘురామ ఆరోపించారు. ఎంపీ స్థాయిలో ఉన్న తనకే ఈ దుస్థితి వస్తే, జగన్ మిగతా సాక్షులను ప్రభావితం చేసి ఉంటారనడానికి ఇంతకన్నా రుజువేమి కావాలని రఘురామ పలుమార్లు చెప్పారు. ఇక, 2017లో సాక్ష్యులను జగన్ బెదిరిస్తున్నారనే ఆరోపణలపై జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన సీబీఐ…ఇపుడు జగన్ సీఎం అయిన తర్వాత తటస్థ వైఖరి అవలంబించడం కూడా చర్చనీయాంశమైంది.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్ బెయిల్ రద్దు కావాలని ప్రయత్నించిన సీబీఐ…తాజాగా ఆ నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇక, జగన్ అసంబద్ధ పాలనను, విధానాలను ప్రశ్నించిన పాపానికి రఘురామపై అనర్హత వేటు వేయించాలని, మనీల్యాండరింగ్, హవాల కేసులు నమోదు చేసి విచారణ జరపాలని లోక్ సభ స్పీకర్, కేంద్రమంత్రులకు వైసీపీ ఎంపిలు ఫిర్యాదులు చేయడం కొసమెరుపు.
కేవలం, రఘురామపై కక్షపూరితంగా వైసీపీ ఎంపీలు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగా జగన్ పలుకడిగిన ముత్యమే అయితే…రఘురామ ఆరోపణలకు సమాధానాలిస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.