వైఎస్ ఫ్యామిలీ పుట్టిందే రాజకీయం కోసం. ఆ కుటుంబంలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది…. అదేంటంటే, వారికి గెలవడం ముఖ్యం, గెలిచే మార్గం కాదు. ఎట్లా అయినా గెలవాలి. ఎవరేమనుకున్నా సరే… గెలుపు అన్నింటినీ మార్చేస్తుంది అని గట్టిగా నమ్ముతుంది ఆ కుటుంబం.
తెలంగాణలోకి వెళ్లాలంటే వీసా తెచ్చుకోవాలి అన్న వైఎస్ కూతురు, సమైక్యాంధ్ర అంటూ పాట పాడిన జగన్ చెల్లెలు ఇపుడు తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడుతుందట. తెలంగాణపై ఇన్ని దెబ్బలు వేసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తారు అని తెలంగాణ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ వైఎస్ కుటుంబం ఏం చేసినా పక్కాస్ట్రాటజీతో చేస్తుంది.
తెలంగాణలో వారు నమ్ముకున్న బలాలు రెండే రెండు.
- క్రిస్టియానిటీ
- రెడ్లు
ఆంధ్రాలు క్రిస్టియన్లలో అత్యధికులు ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వారు లేదా కూలి పని మీద బతికేవారు. వారిలో చాలామంది ఉపాధి, కూలీ కోసం హైదరాబాదులో నివసిస్తారు. ఇలాంటి వారు 40 లక్షలకు పైగా ఉంటారని అంచనా. వీరికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. ఆంధ్రాలోను ఓటు హక్కు ఉంది. ఎపుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకుందో అన్ని చర్చిల్లో తెలంగాణలో ఓటు నమోదు చేసుకోమని సమాచారం ఇచ్చేశారట. ఇక స్థానిక తెలంగాణ క్రిస్టియన్ల సంఖ్య కూడా తక్కువేం కాదు.
ఈ క్రిస్టియన్లు అందరినీ షర్మిల భర్త అనిల్ తన ఆవేశపూరిత ప్రసంగాలతో ఓట్లుగా కన్వర్ట్ చేయగలుగుతారు. కేసీఆర్ గత ఏడాది పెట్టిన ముందస్తు ఎన్నికల కారణంగా ఎలాగూ తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రా ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీనివల్ల క్రిస్టియన్ డబుల్ ఓటు బ్యాంకు తెలంగాణలో షర్మిలకు, ఆంధ్రాలో జగన్ కి పడుతుంది. అంటే పార్టీలు రెండు ఓటర్లు సేమ్ అన్నమాట.
ఇక రెడ్లు షర్మిలతో పెద్దగా కనెక్ట్ అవ్వరేమో అన్న కూసింత అనుమానం షర్మిలకు, జగన్ కి వచ్చింది. అందుకే వైఎస్ భార్య అయిన విజయమ్మను రంగంలోకి దింపారు. విజయమ్మతో పార్టీ లాంచ్ చేస్తే దక్షిణ తెలంగాణలో రెడ్లతో పాటు ఉత్తర తెలంగాణ రెడ్లు షర్మిల పార్టీకి ఆకర్షితులను చేయొచ్చు అన్నది జగన్ – షర్మిల ఉమ్మడి ఆలోచన. అందుకే విజయమ్మతోనే పార్టీ లాంచింగ్ చేయించున్నట్లు తెలుస్తోంది. వైఎస్ అభిమానులు లేదా మాజీ అభిమానులు పెద్ద ఎత్తున మనసు మార్చుకుని తమ పార్టీలోకి వస్తారన్న వ్యూహంతో విజయమ్మను దించారు.