అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల సరసన భారత్ సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చంద్రయాన్.. వంటి కీలక ప్రయోగాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. అయితే.. మానవులను అంతరిక్షంలోకి పంపించడం అనేది మాత్రం ఇప్పటి వరకు భారత్‌కు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిశగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మిషన్ గగన్ యాన్ ను ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గగన్‌యాన్ ప్రయోగం ద్వారా.. అంతరిక్షంలోకి వెళ్లే.. వ్యోమగాములను ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారి పేర్లను ప్రకటించారు. కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో వారిని పరిచయం చేశారు. ప్రధాని ప్రకటించిన నలుగురు.. 1) ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, 2) అంగద్ ప్రతాప్, 3) అజిత్ కృష్ణన్, 4) వింగ్ కమాండర్ సుభాన్షు లు ఉన్నారు. వీరు గగన్ యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
పీఎం మోడీ ఏమన్నారంటే..
‘విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరో చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్ మనదే. రాకెట్ మనదే’ అని ప్రధాని ప్రకటించారు.
కాగా, భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇచ్చారు. రోస్కాస్మోస్ వారిని సుశిక్షితులను చేసింది. 2025లో జరిగే గగన్‌యాన్ కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. వారిని రోదసిలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఇదిలావుంటే, గతంలో రాకేశ్‌శర్మ భారత్ తరఫున అంతరిక్షంలోకి వెళ్లారు. క్షేమంగా తిరిగి వచ్చారు.అంతేకాదు.. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సాధించారు. కానీ, ఆయన పాల్గొన్న ప్రయోగం.. మాత్రం రష్యా చేపట్టింది.